top of page

ఆజాద్ రాజీనామా వెనుక మతలాబు అదేనా.......?


కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ షాకిచ్చారు.కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తోన్న ఆజాద్.. ఇవ్వాళ ఏకంగా పార్టీ నుంచి తప్పుకొన్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపించారు. పార్టీతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న అనుబంధాన్ని తెంచుకున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. 1970లలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని... అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ కోసమే పని చేశానని తన రాజీనామా లేఖలో తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ మారడం లేదని చెప్పారు. పార్టీ ఇప్పటికీ రిమోట్ కంట్రోల్ మోడల్ తో పని చేస్తోందని విమర్శించిన ఆజాద్..పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతున్నా... సరైన చర్యలు తీసుకోవడం లేదని అజాద్ అన్నారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకుండా చేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి మెచ్యూరిటీ లేదని విమర్శించారు. తన రాజీనామా లేఖలో ఆయన రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. గాంధీలపై పదునైన దూషణలతో లేఖ రాసిన ఆయన పార్టీలో కీలక నిర్ణయాలన్నీ రాహుల్ సెక్యూరిటీ గార్డులు, వ్యక్తిగత సహాయకులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశించి రాసిన సుదీర్ఘ లేఖలో సీనియర్ నాయకులను పక్కన పెట్టడం, పార్టీలో అనుభవం లేనివాళ్ల కోటరీ పెరగడమే తన రాజీనామాకు ప్రధాన కారణాలుగా ఆయన పేర్కొన్నారు.


ఇక గులాం నబీ ఆజాద్ రాజీనామా వెనుకు మోడీ పావులు కదిపారనేది కూడా ప్రచారంలో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత ఆప్తుడిగా గులాం నబీ ఆజాద్‌కు పేరుంది. రాజ్యసభ పదవీ కాలం ముగిసిన సమయంలో మోడీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఆజాద్.. ఉప రాష్ట్రపతితో భేటీ కావడాన్ని రాజకీయ కోణంలోనే చూస్తోన్నారు విశ్లేషకులు. ఆజాద్‌ను గవర్నర్‌ పదవి అప్పగిస్తారనే ప్రచారం కూడా మొదలైంది. అందుకే ఇటు రాహూల్ గాంధీని విమర్శిస్తూ రాజీనామా చేయడంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు మోడీ స్కెచ్ వేశారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

bottom of page