
దేశరాజధాని ఢిల్లీలొ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ల నడము రాజకీయా వార్ ముదురుతోంది. బీజేపీ పై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గుజరాత్ ఎన్నికల్లో భయంతోనే ఈడీ, సీబీఐలను కేంద్రం ఉసిగొల్పుతోందని ఆరోపించారు. దాని ఫలితమే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఇతర మంత్రుల ఇళ్లలో సోదాలని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అయ్యింది. అసెంబ్లీలో కేంద్రంపై కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. ఆప్‌ను ఏ ఒక్కరూ వీడలేదని చెప్పేందుకు అసెంబ్లీలో బల నిరూపణ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ కాస్తా ఆపరేషన్ కీచడ్ గా మారనుందని అన్నారు. ఢిల్లీ ఆప్ సర్కార్‌ను కూలదోయటమే బీజేపీ ముందున్న ప్రధాన లక్ష్యమన్న కేజ్రీవాల్... ఇప్పటికే మణిపూర్, గోవా, మధ్యప్రదేశ్, బిహార్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను కూలదోశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాలను కూలదోయడంలో వారు సీరియల్ కిల్లర్లు'' అంటూ బీజేపీపై మండిపడ్డారు. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటూ ఉంటే.. వీరు ప్రభుత్వాలను కూలుస్తున్నారంటూ విమర్శించారు. అంతే కాదు ఇప్పటి వరకు ఇతర పార్టీలకు చెందిన 277 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్ల చొప్పున 500 కోట్లు బీజేపీ చెల్లించిందని ఆరోపించారు. ఈ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ రూ. 5,500 కోట్లను ఖర్చు చేసిందని చెప్పారు. ఇతర పార్టీ టికెట్లపై గెలిచిన ఈ ఎమ్మెల్యేలు డబ్బులకు అమ్ముడుపోయి బీజేపీలో చేరిపోయారని విమర్శించారు. ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టుగా బీజేపీ కొనడంతోనే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని కేజ్రీ అన్నారు. ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ఉపయోగించిన సొమ్మంతా సామాన్యుల నుంచి వసూలు చేసిందేనని... అందుకే ద్రవ్యోల్బణం పెరిగిందని చెప్పారు. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో దేశంలో సామాన్యుల జీవితాలు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సోమవారం దిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, తాజాగా తన నివాసంలో కేజ్రీవాల్ నిర్వహించిన సమావేశానికి ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం సందేహాలకు తావిస్తోంది. ఇంకోవైపు, 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ టార్గెట్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు, బీజేపీ తమను సంప్రదించిందంటూ 12 మంది ఆప్ ఎమ్మెల్యేలు చెప్పడం కలకలం రేపుతోంది. ఢిల్లీలో రానురాను ఏం జరగబోతోందోనని అందరు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.