
తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ కలిసి..పశ్చిమ బెంగాల్ మోడల్‌ను అమలు చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెండు పార్టీల మధ్యే పోలింగ్ పోలరైజేషన్ జరిగి.. కేసీఆర్ అధికారం నిలబడాలి, ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ రావాలన్నదే వాటి వ్యూహమని.. వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రచించిన ఈ ప్లాన్ ప్రకారమే రెండు పార్టీలూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ఇదే వ్యూహాన్ని అనుసరించి తన అధికారం నిలబెట్టుకున్నారని.. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ వచ్చేలా చూసుకున్నారని రేవంత్ ఆరోపించారు. తెలంగాణను కాంగ్రెస్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ కలిసి ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని, రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మోదీ, కేసీఆర్ ఒకే నాణానికి బొమ్మ, బొరుసు లాంటివారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం మండలాలవారీగా నియమించిన ఇన్‌చార్జులతో గాంధీభవన్ నుంచి జూమ్ యాప్ ద్వారా రేవంత్‌రెడ్డి, పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు తదితరులు సమావేశమం అనంతరం మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని సరైన సమయంలో నిర్ణయించి ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. మునుగోడు నియోజకవర్గంలో మండలాలవారీగా నియమించిన పార్టీ ఇన్‌చార్జులు సెప్టెంబరు 1 నుంచీ గ్రామగ్రామానా పర్యటించనున్నట్టు చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, శాంతి భద్రతల అంశాలపై చర్చ జరగకుండా బీజేపీ, టీఆర్‌ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయన్నారు. మునుగోడులో పార్టీ ఫిరాయింపుల కోసం ఆ రెండు పార్టీలూ కమిటీలనూ నియమించుకున్నాయని.. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులపైన ఒత్తిడి తెచ్చి, నజరానాలు ఇచ్చి కొనే ప్రయత్నాలు రెండు పార్టీలూ చేస్తున్నాయని.. ఒక్కో నాయకుడికి రూ. 40 లక్షల నుంచి రూ. కోటి వరకు ధర చెల్లిస్తున్నారని ఆరోపించారు.
ఇక మునుగోడులో ఎలాగైనా సరే ఉప ఎన్నికలో గెలవాలనే వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్. కానీ ఇప్పటివరకూ అభ్యర్థిని ఫైనలేజ్ చేయలేదు. అయితే తాము ప్రపోజ్ చేస్తున్న వ్యక్తినే క్యాండిడేట్‌గా డిక్లేర్ చేయాలని సీనియర్లు ఈగోలకు పోతున్నారట. బీసీ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని కొందరు నేతలు ప్రపోజల్స్ పెడుతుంటే కృష్ణారెడ్డికే టికెట్ ఇవ్వాలని రేవంత్ అండ్ కో వాదిస్తుందట. ఉమ్మడి నల్గొండ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తాము బలపరుస్తున్న పాల్వాయి స్రవంతికే టికెట్ ఇవ్వాలని లాబియింగ్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే మునుగోడులో కింది స్థాయి కాంగ్రెస్ నేతలకు పక్క పార్టీలు గాలం వేస్తున్నాయట. దీంతో పార్టీలో ఉంటారో వేరే పార్టీకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొందట. ఇప్పటికైనా పార్టీ క్యాండెట్‌ని అనౌన్స్ చేస్తే క్యాడర్ పని క్యాడర్ చేసుకుంటుందని, లేకపోతే తలో దిక్కు వెళ్లిపోతారని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. అయితే వీలైనంత తొందరగా అభ్యర్థిపై నిర్ణయం తీసుకోకపోతే మునుగోడుతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ ఖాళీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని మెజార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మునుగోడు విషయంలో కాంగ్రెస్ నిర్ణయం ఎలా ఉండబోతోందో చూడాలి.