
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వేదికగా వార్ కొనసాగుతోంది. మెడికల్ కాలేజీల మంజూరుపై ఇరువురి మధ్య హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. మెడికల్ కాలేజీలపై తెలంగాణ నుంచి ఒక్క ప్రతిపాదన కూడా రాలేదని మన్సూఖ్ మాండవీయ పేర్కొన్నారు. స్వల్పకాలంలో ప్రధాని మోదీ భారీగా వైద్య కళాశాలలు మంజూరు చేశారని తెలిపారు. ప్రతిపాదనలు పంపిన రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేశామని మాండవీయ చెప్పారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ చేసిన ట్వీట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. దేశ వ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం ప్రధాని మోదీ సాధించిన గొప్ప విజయమని మాండవీయ ట్వీట్ చేశారు. ట్వీట్ కు 157 కాలేజీల జాబితాను జత చేశారు. ఈ విషయంపై స్పందించే ముందు కేంద్రమంత్రి సమీక్షించే ఉంటారనే భావిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాదు... మెడికల్ కాలేజీల కోసం 2015లో అప్పటి ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, 2019లో అప్పటి ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి రాసిన లేఖలను కూడా షేర్ చేశారు. కొత్త వైద్య కళాశాలల కోసం కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం అడుగుతూనే ఉందని... అయినప్పటికీ కేంద్రం నుంచి స్పందన రాలేదని చెప్పారు. మెడికల్ కాలేజీల అంశంపై స్పందించే ముందు పూర్తి వివరాలను తెలుసుకుని ఉంటే బాగుండేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు అడిగినా కూడా ఒక్క వైద్య కళాశాలను కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో ఖాళీగా ఉన్న 544 పోస్టుల భర్తీలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. బీబీనగర్ ఎయిమ్స్‌ను యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. తెలంగాణ ఒక్క విద్యా సంస్థను కూడా మీ ప్రభుత్వం మంజూరు చేయలేదని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో మరోసారి టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య రాజకీయాలు తారాస్థాయికి చేరాయని అందరూ చర్చించుకుంటున్నారు.