top of page

కేసీఆర్ పాదయాత్ర చేస్తే నేను ఆపేస్త: బండి సంజయ్..


తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. సీఎం కేసీఆర్ పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్తే.. తాను ప్రజా సంగ్రామ యాత్రని ఆపేస్తానంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్న క్రమంలో రెండు పార్టీల నేతల మధ్య దాడులు సైతం జరిగాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌పై బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్‌ 12 నుంచి నాలుగో విడత పాదయాత్ర ప్రారంభిస్తున్నాను. అయితే, ఎలాంటి బందోబస్తు లేకుండా కేసీఆర్ పాదయాత్ర మొదలుపెడితే నేను ప్రజాసంగ్రామ యాత్ర ఆపేస్తానని కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఇక రాష్ట్రానికి కేసీఆర్‌ ఏం చేశారో చెప్పకుండా బీజేపీని తిడుతున్నారు. బీజేపీని తిట్టడానికే కేసీఆర్‌ బహిరంగ సభలు పెడుతున్నాడని బండి సంజయ్ అన్నారు. ఇక ఇన్నేళ్ల అధికారంలో ప్రజలకు చేసేంది ఏమీ లేదని.. కేసీఆర్ పాలనలో క్రైమ్ రేట్‌లో తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందంటూ ఆరోపించారు. మోదీకి, కేసీఆర్‌కి నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని వ్యంగ్యంగా విమర్శించారు. 34 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని.. లక్ష రూపాయల రుణమాఫీ ఏమైందని బండి ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఎస్సీలకు మూడెకరాల భూమి ఏమైందో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన అడిగారు. మరోవైపు బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. పాదయాత్ర రూట్‌మ్యాప్ ఏంటి అనేది సెప్టెంబర్ 2, 3 తేదీల్లో జీహెచ్ఎంసీ, ఉమ్మడి రంగారెడ్డి పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశం తర్వాత నిర్ణయిస్తారు. ప్రతి రోజు 12 నుంచి 16 కిలోమీటర్ల యాత్ర కొనసాగించాలని పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కుత్భుల్లాపూర్, కూకట్‌పల్లి, మేడ్చల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్‌బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.

bottom of page