top of page

జాతీయ రాజకీయాల్లోకి వడివడిగా కేసీఆర్ అడుగులు..


కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమికి ప్రత్యాత్నయంగా సీఎం కేసీఆర్ పక్షాలను కూడగట్టి, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా జాతీయ రాజకీయాల్లో తన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న కేసీఆర్ మరోసారి తన జాతీయ రాజకీయాల కార్యాచరణలో భాగంగా ఆయన ఈ నెల 31న బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో సమావేశం కానున్నారు. పాట్నాలో నితీశ్ కుమార్ తో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారని తెలుస్తోంది. కాగా, చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన భారత జవాన్ల కుటుంబ సభ్యులను కూడా సీఎం కేసీఆర్ తన బీహార్ పర్యటనలో కలవనున్నారు. అమర జవాన్లకు గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయాన్ని ఈ సందర్భంగా వారికి అందిస్తారు. అంతేకాదు, సికింద్రాబాద్ టింబర్ డిపోలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగి 12 మంది బీహార్ వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించనున్న సీఎం కేసీఆర్... బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో కలిసి ఆర్థిక సాయం చెక్కులు అందిస్తారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. కొన్నాళ్లుగా బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తులను ఏకం చేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్. ఇందుకోసం పలు రాష్ట్రాల్లో బీజేపీని వ్యతిరేకించే వారితో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు.


ఈ క్రమంలోనే గతంలో జేడీఎస్, శివసేన, సమాజ్‌వాదీ, ఆప్ సహా అనేక ఇతర పార్టీల నేతలతో చర్చించిన సీఎం కేసీఆర్.. తాజాగా ఇటీవల బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో దోస్తీ చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో ఆర్జేడీ ముఖ్యనేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. గతంలోనూ పలుసార్లు తేజస్వి యాదవ్‌తో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. అయితే ప్రస్తుతం బీహార్‌లో నితీష్‌తో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న ఆర్జేడీ పార్టీ.. ఆ రాష్ట్రంలో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వారితో ఎలాంటి చర్చలు జరుపుతారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు కేసీఆర్. ఈ క్రమంలోనే ఆయన ఈ పార్టీల మద్దతు తీసుకుని జాతీయ రాజకీయాల్లో ఏ రకంగా అడుగులు వేస్తారు ? ఎలా తన ప్రస్థానాన్ని మొదలుపెడతారు ? అన్నది తెలియాల్సి ఉంది. ఇటీవల రెండు రోజుల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘం నేతలతో చర్చలు జరుపుతున్న కేసీఆర్.. వాళ్లు తనను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని సోమవారం జరిగిన పెద్దపల్లి బహిరంగ సభలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరి రానున్న రోజుల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్రవేస్తారో లేదో చూడాలి.

bottom of page