top of page

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ శకం ఆరంభమయిందా..?

Updated: Sep 2, 2022జాతీయ రాజకీయాలే లక్ష్యం తెలంగాణ సీఎం కేసీఆర్ మరింత వేగంగా ముందుకు కదులుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఇవాళ బిహార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కేసీఆర్ గతంలో ప్రకటించిన ప్రకారం గాల్వాన్ లోయ ఘర్షణలో అమరులైన ఐదుగురు సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్‌ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం నితీశ్ కుమార్‌తో కలిసి భోజనం చేస్తారు. సైనిక కుటుంబాలు, అగ్ని ప్రమాద బాధితుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక భేటీలో పాల్గొనున్నట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్, నితీశ్ చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నితీశ్ మళ్లీ తిరిగి బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ కూటమిని ఏర్పాటు చేసి బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఇటీవల దేశ పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జాతీయ రాజకీయాలపై ఇరు నేతలు ఎలాంటి చర్చలు జరుపుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పలుమార్లు ఆయన చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ బిహార్ వెళ్లనున్న నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్‌పై ఎలాంటి ప్రకటన వస్తుందో అని రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. బీజేపీ, కాంగ్రెసేతర కూటమిని ఈ సారి ఢిల్లీ గద్దెపై నిలపేందుకు కేసీఆర్ సర్వత్రా కృషి చేస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న మూడు రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారించనట్లు సమాచారం. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక ఎన్నికల్లో పోటీపై వ్యూహం రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


ఆయా రాష్ట్రాల్లో రైతుల నేతలు అభ్యర్థుల గెలుపోటములు ఎలా ఉన్నప్పటికీ... సీఎం కేసీఆర్ స్వయంగా అక్కడకు వెళ్లి ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో కొత్త చర్చ లేవనెత్తాలని సీఎం కేసీఆర్ ప్లాన్‌గా తెలుస్తోంది. ఇటీవల 26 రాష్ట్రాలకు చెందిన రైతులు తెలంగాణలో పర్యటించారు. ప్రగతి భవన్‌లో రెండు రోజుల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్, మోటార్లకు మీటర్లను వ్యతిరేకించడం, సాగునీటి సౌకర్యం, గ్రామాల్లో కల్లాల నిర్మాణం, రైతు వేదికలు తదితరాల గురించి అధికారులు వారికి వివరించారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని.. దేశవ్యాప్తంగా అమలు చేస్తే బాగుటుందని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ పాలిత రాష్ట్రాల ఎన్నికల్లో కమలం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కూడా ముద్ర వేస్తారా లేదా.. ఇది జరగాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

bottom of page