
జాతీయ రాజకీయాల్లో బలమైన పాత్ర పోషించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మరో రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. వరుసగా బీజేపీయేతర ముఖ్యమంత్రులను కలుస్తున్న ఆయన తాజాగా వినాయక చవితి నాడు బీహార్ సీఎం నితీష్‌కుమార్‌తో భేటీ కావడం..అనంతరం మాజీ సీఎం, ఆర్జేడీ అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్‌తోనూ భేటీ అయి చర్చలు జరిపారు. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. ఈ నేపథ్యంలోనే యూపీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే కేసీఆర్ పర్యటనకు సంబంధించి కీలక వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక కేసీఆర్ జాతీయ రాజకీయలపై దృష్టి సారించి చాలా రోజులవుతోంది. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఓ కూటమిని తీసుకు రావాలని ఆయన చాలా ప్రయత్నాలు చేస్తు వస్తున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కేసీఆర్ 2019 ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నారు. కేంద్రాన్ని శాసించే రీతిలో సీట్లు సాధించి ఇతర ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టి కింగ్ మేకర్ అవ్వాలనుకున్నారు. అందుకే నవీన్ పట్నాయక్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, బెంగాల్ వటి రాష్ట్రాల్లో పర్యటించారు. కానీ ఎన్నికలకు ముందు కూటమి సాధ్యం కాలేదు. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా బలంగా పోరాడుతున్నారు. ఇతర పార్టీలన్నింటినీ ఏకం చేశారు. అయితే చంద్రబాబుతో కలిసే ఉద్దేశం లేని కేసీఆర్.. సైలెంట్ అయ్యారు.ఏపీలో జగన్.. తెలంగాణలో తాము అత్యధిక సీట్లు సాధిస్తే కింగ్ మేకర్లం కావొచ్చనుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు తేడా కొట్టాయి. దాంతో కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రయత్నాలు అక్కడితో ఆగిపోయాయి.
రెండు సార్లు ప్రయత్నాలు విఫలమైనా కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. మూడో సారి రాజకీయ పరిస్థితులు మరింత టఫ్‌గా మారాయి. ప్రాంతీయ పార్టీలు కుంచించుకుపోయాయి. అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టడానికి .. సిద్ధంగా లేవు.. ఏదైనా ఉంటే ఎన్నికల తర్వాత చూసుకుందామన్నట్లుగా పరిస్థితి ఉంది. అయితే తన లక్ష్యాన్ని అలా వదిలేసుకుంటే కేసీఆర్ ఎందుకు అవుతారు. నేరుగా సొంత జాతీయ పార్టీ ఆలోచన చేస్తున్నట్లు ప్రకటించారు. రైతులదర్నీ ఏకతాటిపైకి తీసుకు వస్తే.. తెలంగాణ ఉద్యమం తరహాలో అందర్నీ ఏకం చేస్తే.. అనుకున్నది సాధించినట్లవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీయేతర పార్టీలతో కలిసి చర్చలు జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా బీజేపీ కి కంచు కోటల మారిని యూపీలోనూ కేసీఆర్ అడుగుపెడుతుండటంతో ఉత్కంఠను రేపుతోంది. మరి రానున్న రోజుల్లో కేసీఆర్ ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తారో చూడాలి.