top of page

తదుపరి కాంగ్రెస్ అధ్యక్షడు ఎవరో తెలిసేది అప్పుడే..!



కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికలకు ముహూర్తం ఖరారయింది. ఢిల్లీలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేశారు. అక్టోబరు 17న కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికలకు సెప్టెంబరు 22న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యాలు చవిచూడడంతో ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అప్పటి నుంచి సోనియానే తాత్కాలిక ప్రాతిపదికన పార్టీ నాయకత్వ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.


వైద్య పరీక్షల కోసం సోనియా గాంధీ విదేశాలకు వెళ్లగా ఆమె వెంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వెళ్లారు. సోనియాతో పాటు రాహుల్, ప్రియాంక లు వర్చువల్ గా హాజరైయ్యారు. వీరితో పాటు భేటీలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, జీ 23 నేత ఆనంద్ శర్మ, కాంగ్రెస్ ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూధన్ మిస్త్రీ, కేసి వేణుగోపాల్, మాజీ కేంద్ర మంత్రులు జైరాం రమేష్, ముకుల్ వాస్నిక్, పి చిదంబరం, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లాత్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భఘేల్ తదితర సీడబ్ల్యుసీ సభ్యులు పాల్గొన్నారు. సీనియర్ నేతలు పలువురు వరుసగా రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. నామినేషన్లు సమర్పించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల తేదీ ఖరారుతో పాటు పార్టీ చేపట్టదల్చిన పలు కార్యక్రమాలపైనా చర్చించారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ చేపట్టిన హాల్లా బోల్ ర్యాలీని సెప్టెంబర్ 4న నిర్వహించనున్నట్లు మరో సారి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుండి భారత్ జోడో యాత్ర ప్రారంభించే అంశంపైనా చర్చించారు.


అయితే రాహుల్ గాంధీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రాహుల్ అధ్యక్ష పదవి చేపట్టాలని దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే పేర్కొంటున్నారు. రాహుల్ గాంధీ మరో సారి ఎన్నిక కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. మరో పక్క రాహుల్ గాంధీ మాత్రం అధ్యక్ష పదవి చేపట్టడానికి సుముఖంగా లేరని వార్తలు వినబడుతున్నాయి. పార్టీ నేతల ఒత్తిడితో మరో సారి అధ్యక్ష పదవిని రాహుల్ చేపడతారా లేక గాంధీ యేతర కుటుంబం నుండి వచ్చిన వారికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా అనేది వేచి చూడాలి.

bottom of page