top of page

పక్కా ప్రణాళికతో..మరో రాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్


దేశ రాజకీయాల్లోకి వెళతామని చెప్పిన సీఎం కేసీఆర్ అందుకు తగ్గట్లుగానే ఒక్క రాష్ట్ర పర్యటనను చేస్తూ మార్గం సుగుమం చేసుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడబెట్టుకుంటున్న కేసీఆర్ ఇప్పుడు హర్యాణ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 25 న హర్యాణ పర్యటనకు వెళ్తున్న కేసీఆర్ స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఉపప్రధాని చౌధరి దేవిలాల్ 108 వ జయంతి సందర్భంగా జరగనున్న సమ్మాన్ దివాస్ లో పాల్గొననున్నాడు. దేవిలాల్ కుమారుడు హరియాణ మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత ఓ ప్రకాష్ చౌతాలా ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపినట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ మధ్యే గుజరాత్ మాజీ సీఎం వాఘేలా కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురు నేతలు దేశ రాజకీయాలు, జాతీయ అంశాలపై చాలా సేపటి వరకు చర్చించారు. జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలు కలిసి పెను మార్పు తీసుకురావాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీ వైఫల్యాలు, మతతత్వ రాజకీయాలు అనే అంశాలను దేశవ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే విషయం గురించి ఇరువురు మాట్లాడారు. కేసీఆర్ జాతీయ పార్టీ పేరుపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS).. ఇకపై భారత రాష్ట్ర సమితి (BRS)గా మారుతుందని అప్పట్లో చర్చ జరిగింది. కానీ కొత్త పార్టీలో రైతు పేరు వచ్చేలా మార్పులు చేశారని ప్రచారం జరుగుతోంది. పార్టీ జెండా సైతం వ్యవసాయాన్ని ప్రతిబింబించేలా ఆకుపచ్చ రంగులో ఉండవచ్చని సమాచారం. ఎన్నికల గుర్తు విషయంలోనూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రైతునాగలి గుర్తుతో పార్టీని లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. ఐతే కొందరు టీఆర్ఎస్ నేతలు మాత్రం.. జాతీయ పార్టీ జెండా కూడా గులాబీ రంగులోనే ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. రైతులతో పాటు బడుగు, బలహీనవర్గాలు సంక్షేమాన్ని ప్రతిబింబించేలా.. తెలంగాణ పథకాలను జెండాలో పొందుపరచచ్చని తెలుస్తోంది. కానీ సీఎం కేసీఆర్ గానీ, ఇతర టీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు దీనిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో హైదరాబాద్ వేదికగానే జాతీయ పార్టీని ప్రకటిస్తారని మాత్రమే.. లీకులిచ్చారు.

bottom of page