top of page

పేదల ప్రాణాలకంటే..రాజకీయాలే ముఖ్యమా?: కేసీఆర్ పై విరుచుకుపడ్డ ప్రతిపక్ష నాయకులు

Updated: Sep 2, 2022
ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇబ్రహీంపట్నంలో 34 మంది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నారని… వాళ్లంత నిరుపేద కుటుంబానికి చెందినవారన్నారు. అల్లుడు హరీశ్ సమర్థుడని మామ ఆరోగ్య శాఖ అప్పగించారని ఫైర్ అయ్యారు. ఆయన హయాంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. అవి ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. మామా అల్లుళ్లు కేసీఆర్, హరీశ్ రావు మహిళా హంతకులని ఆరోపించారు. మృతుల కుటుంబాలను మంత్రి హరీశ్ రావు ఎందుకు పరామర్శించట్లేదని ప్రశ్నించారు. మంత్రి హరీశ్ రావును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. తూతూ మంత్రంగా అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవద్దని, వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నేషనల్ మహిళా కమిషన్‌కు పిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఈ ఘటన పై బీజేపీ నేత బండి సంజయ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నలుగురు మహిళల మృతి చెందడానికి కేసీఆర్ సర్కార్ మూర్ఖత్వమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బండి సంజయ్ తాజాగా పరామర్శించారు. మంత్రి హరీష్ రావు తీరుపై బండి మండిపడ్డారు. బాధితులను పరామర్శించకుండా సీఎం బీహార్ వెళ్ళటం దుర్మార్గపు చర్య అని అన్నారు. తెలంగాణలోని పేదలను వదిలేసి పంజాబ్ బీహార్లో డబ్బులు పంచటం అన్యాయమన్నారు. చనిపోయిన మహిళల పిల్లల చదువు భవిష్యత్తు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. కేసీఆర్‌కు ఇబ్రహీంపట్నం ఘటన బాధితులను పరామర్శించే తీరిక లేదన్నారు. కానీ పట్నా వెళ్లి రాజకీయాలు చేసే టైం ఉందా?, పేదల ప్రాణాలకంటే..రాజకీయాలే ముఖ్యమా? అని ఆయన ప్రశ్నించారు. మృతులు కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఇబ్రహీపంట్నం ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయాలని వ్యాఖ్యానించారు.

bottom of page