top of page

మునుగోడులో పార్టీల హోరు..


తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల వాతావరణం ఇప్పటి నుండే కనిపిస్తుంది. మునుగోడు ఉపఎన్నిక తీసుకువచ్చిన పొలిటికల్ హీట్ రాష్ట్రంలో నాయకులు మధ్య సెగలు రేపుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటుకోవాలని ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్ ,బిజెపి , కాంగ్రెస్ లు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు వెళుతున్నాయి. ఇక్కడ గెలవడం ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకు బాటలు వేసుకోవచ్చనే లక్ష్యంతో అన్ని పార్టీలు ప్రధానంగా కష్టపడుతున్నాయి. ఇక మునుగోడు ఉప ఎన్నికల రేసులో బిజెపి, టిఆర్ఎస్ ఒకదానికొకటి బలమైన పోటీ ఇస్తున్నట్లుగా కనిపిస్తుంటే, కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానం అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు, పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు కాంగ్రెస్ పార్టీని కొద్దిగా ఇబ్బంది పెడుతున్నప్పటికి.. అక్కడ ఆ పార్టీకి ప్రధానం బలం కార్యకర్తలేనని చాప కింద నీరులా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోవడం ఖాయమని చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు.ఇక ఎన్నికల ప్రచారంలో, వ్యూహాత్మకంగా మునుగోడులో ఎత్తుగడలు వేయడంలో బిజెపి, టిఆర్ఎస్ బలంగా దూసుకుపోతున్నాయి.


అంతే కాదు కొత్తగా తెలంగాణలో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల చూపు ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం పైన పడినట్లు తెలుస్తోంది. వైయఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించిన తరువాత పాదయాత్రలు, ప్రజా సమస్యలు , నిరుద్యోగ దీక్షలు అంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. అయితే పార్టీ స్థాపించిన దగ్గర నుంచి తెలంగాణలో అనేక ఉప ఎన్నికలు జరిగినా, షర్మిల తమ పార్టీ అభ్యర్థులను పోటీకి పెట్టలేదు. అయితే ఈ సారి మాత్రం తమ అభ్యర్థిని పోటీకి దించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో షర్మిల మునుగోడు నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర నిర్వహించారు. దీంతో మునుగోడు ఉపఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో తాడోపేడో తేల్చుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాయి.

ఈ తరుణంలో మునుగోడు ఉపఎన్నికపై మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరిట.. ఆ లేఖ ఉంది. అధికారం కోసం బీజేపీ మతాల మధ్య చిచ్చుపెడుతోందని మావోయిస్టులు లేఖలో ఆరోపించారు. వ్యాపారం కోసం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి బీజేపీ అవసరమైందన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు ముస్లింలను అవమానించేలా ఉన్నాయని లేఖలో వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ లంచగొండి, కుటుంబ పాలన వల్లే తెలంగాణలో బీజేపీ ముందుకు వచ్చిందని.. మావోయిస్టు నేత జగన్ లేఖలో ప్రస్తావించారు. ప్రజా వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పీడన వ్యవస్థలను నిర్మూలించాలని సూచించారు.

bottom of page